- సంస్థ భూముల్లో నిర్మాణం..ఇండ్లకూ పట్టాలు
- ఇప్పటికే 5,700 ఎకరాలు రెవెన్యూ శాఖకు బదిలీ
- డిపెండెంట్లకు 15 రోజుల్లో ఉద్యోగాలు
- వివరాలు వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఎన్నో ఏండ్లుగా కలగా మిగిలిన కార్మికుల సొంత ఇంటి కలను సాకారం చేస్తూ నిర్ణయం తీసుకున్నది. సింగరేణి సంస్థ భూముల్లో ‘నెహ్రూ హౌసింగ్ కార్పొరేషన్’ ద్వారా కాలనీలు ఏర్పాటుచేసి, ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. మంగళవారం ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ వివరాలను వెల్లడించారు.
సింగరేణి జాగాల్లోని ఇండ్లకు పట్టాలు అందిస్తామని, ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 5,700 ఎకరాలను సింగరేణి నుంచి రెవెన్యూశాఖకు బదిలీ చేసినట్టు చెప్పారు. డిపెండెంట్లకు 15 రోజుల్లో ఉద్యోగాలు ఇస్తామని, మారుపేర్ల మార్పుపై అధికారులతో కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు.
నెహ్రూ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇండ్లు
సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో ఇప్పటి వరకు మైనింగ్ చేపట్టని ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఇండ్ల నిర్మాణానికి అనువైన లేఅవుట్లు సిద్ధం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పేరిట ‘నెహ్రూ హౌసింగ్ కాలనీ’ ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
‘‘సింగరేణి నుంచి రెవెన్యూ శాఖకు తిరిగి అప్పగించిన 5,774 ఎకరాల భూముల్లో 4,500 ఎకరాలను గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్సార్ పేదలకు పట్టాల రూపంలో అందించారు. మిగిలిన సుమారు 1,250 ఎకరాలకు సంబంధించి జీవో నంబర్ 76 ప్రకారం అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలి”అని సింగరేణి ఆఫీసర్లను ఆదేశించారు.
సింగరేణి అధికారులు, జిల్లా కలెక్టర్‌తో కూడిన కమిటీ ఆక్రమిత నివాస ప్రాంతాల్లోఉన్న వారి ప్రాథమిక జాబితాను సిద్ధం చేస్తున్నదని, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి, వారి అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని లబ్ధిదారుల సమగ్ర జాబితాను రూపొందిస్తామన్నారు. ఈ ప్రక్రియ నెల రోజుల్లోపు పూర్తి చేస్తామని చెప్పారు.
మారుపేర్ల సమస్యపై చర్యలు
సింగరేణిలో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లు, ఇతర చట్టపరమైన ప్రక్రియలను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేసి అర్హులైన అభ్యర్థులకు ఉత్తర్వులు అందజేయాలని ఆదేశించినట్టు భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల పేర్ల మార్పులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 136 నుంచి గరిష్టంగా 170 మంది సమస్యలను మానవీయ కోణంలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించామని చెప్పారు.
ఇందుకోసం ఏర్పాటు చేసిన సింగరేణి అధికారుల కమిటీ సిఫార్సుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ కోసం కార్మికులు కొత్తగూడెం వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి పరిధిలోని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రతి నెలా నిర్ణీత రోజున మెడికల్ బోర్డు సమావేశాలు నిర్వహించాలని ఆదేశించామన్నారు.
ఆయా ఆసుపత్రుల్లోనే వైద్య పరీక్షలు నిర్వహించి, వీలైనంత ఎక్కువ మంది కార్మికులకు ప్రయోజనం కలిగేలా మెడికల్ ఇన్వాలిడేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తామని తెలిపారు. కరోనా సమయంలో లేదా ఇతర స్థానిక కారణాలతో విధులకు హాజరుకాక ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వన్‌టైమ్ ఆప్షన్ కింద తిరిగి విధుల్లోకి తీసుకునే అంశంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగానే కార్మికుల పెర్క్స్ , అలవెన్స్‌లపై ఆదాయపన్నును కూడా సంస్థ తరఫున ప్రభుత్వానికి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు వెల్లడించారు.
ఏరియా హాస్పిటల్లోనే మెడికల్ బోర్డు పరీక్షలు
సింగరేణి పరిధిలోని ఏరియా ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా తీర్చిదిద్దుతామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘‘సామాన్య కార్మికుడు కూడా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సింగరేణి ఆసుపత్రుల్లోనే అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. అవసర మైతే వైద్యుల వేతనాలు, పారితోషికాలను పెంచి నిపుణులైన వైద్యులను నియమిస్తాం. అత్యవసర వైద్యం కోసం కార్డియాక్, క్యాథ్ ల్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’’ అని హామీ ఇచ్చారు. బొగ్గు గనులు, ఓవర్‌బర్డెన్ డంప్‌ల దుమ్ము వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతున్న అంశాన్ని దృష్టిలో ఉంచుకొని సింగరేణి పరిధిలోని పాత జిల్లాల్లో ప్రతి గ్రామానికి వెళ్లి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అధికారులకు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ)ను చెల్లించేలా యాజ మాన్యాన్ని ఆదేశించినట్టు చెప్పారు. సింగరేణి పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రులు, ఇతర ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి సౌర విద్యుత్ విని యోగాన్ని పెంచాలని, ఖరీదైన పట్టణ, వాణిజ్య భూములను సోలార్ ప్లాంట్లకు వినియో గించకుండా, పట్టణాలకు వెలుపల ఉన్న నిరుపయోగ భూములు, ఓవర్‌బర్డెన్ గుట్టలను ఇందుకు ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీ అమలులో భాగంగా రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు.
